ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మానవ సంబంధాలను మంటగలిపే అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. సొంత కవల సోదరి అని కూడా చూడకుండా, ఒక యువ ఇంజినీర్ తన సోదరిని అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నిందితుడు హార్దిక్, అతని సోదరి హిమశిఖ ఇద్దరూ ఇంజినీర్లుగా గుర్గావ్లో పని చేసేవారు. అయితే ఏడాదిన్నర క్రితం హార్దిక్ ఉద్యోగం వదిలేసి సోషల్ మీడియాకు బానిసయ్యాడు. ఈ క్రమంలో పూణేకు చెందిన ఒక మహిళతో ఆన్లైన్ ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కెరీర్ పాడుచేసుకోవద్దని, జీవితంలో స్థిరపడాలని సోదరి హిమశిఖ తరచూ వారించడం అతడికి కక్షగా మారింది.
మార్చి 6వ తేదీ సాయంత్రం వీరిద్దరి మధ్య కెరీర్ మరియు ప్రేమ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఉన్మాదిగా మారిన హార్దిక్, కూరగాయలు కోసే కత్తితో హిమశిఖపై దాడి చేశాడు. ఆమె మరణించినా వదలకుండా ఏకంగా 84 సార్లు కత్తితో పొడిచి తన కసినంతా తీర్చుకున్నాడు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న సోదరి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న తన తల్లి నీలిమ వద్దకు వెళ్లాడు. “అమ్మా.. నీకోసం ఇంట్లో ఒక సర్ప్రైజ్ ఉంది, పదా వెళ్దాం” అని నమ్మించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.
తల్లి నీలిమ ఇంట్లోకి అడుగుపెట్టగానే రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతురి మృతదేహాన్ని చూసి షాక్‌తో కేకలు వేసింది. ఆ సమయంలో హార్దిక్ తన తల్లిపై కూడా దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో పెట్టిన కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని హార్దిక్‌ను అడ్డుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయపడిన నీలిమను ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న హార్దిక్‌ను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. విచారణలో, తన కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల్లో కుటుంబ సభ్యులు పదే పదే సలహాలు ఇస్తూ వేధించడం వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు.




